Breaking News

హోర్ముజ్‌లో ఇంటర్నెట్ కేబుల్స్‌పైనా టోల్?.. ఇరాన్ కొత్త ప్రతిపాదన

మే 18, (నేటి తెలుగు పత్రిక): హోర్ముజ్ జలసంధిపై ఆధిపత్యం చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న ఇరాన్ తాజాగా సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్స్‌పైనా టోల్ ఫీజులు విధించే ఆలోచనలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థకు కీలకమైన ఈ కేబుల్స్‌ను వినియోగిస్తున్న టెక్ దిగ్గజ సంస్థలు ఫీజులు చెల్లించాలని ఇరాన్ కోరుతున్నట్లు సమాచారం.గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి అంతర్జాతీయ సంస్థల డేటా మార్పిడి ప్రధానంగా సముద్రగర్భ ఫైబర్ కేబుల్స్ ద్వారానే జరుగుతోంది. అమెరికా, యూరప్, ఆసియా దేశాల మధ్య ఇంటర్నెట్ కనెక్టివిటీకి ఇవే ప్రధాన ఆధారం. ఈ కేబుల్స్‌కు ఆటంకం కలిగితే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.హోర్ముజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని ప్రస్తావిస్తున్న ఇరాన్.. కేబుల్స్ వినియోగానికి టోల్‌తో పాటు లైసెన్స్ ఫీజులు కూడా చెల్లించాలని టెక్ కంపెనీలను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేబుల్స్ మరమ్మతులు, నిర్వహణ పనులు కూడా ఇరాన్ సంస్థలకే అప్పగించాలని అక్కడి సైనిక వర్గాలు పేర్కొన్నాయి.ఇక ఈ ఫీజులు చట్టబద్ధమేనని ఇరాన్ వాదిస్తోంది. సముద్రగర్భ మౌలిక వసతులపై తీరప్రాంత దేశాలకు హక్కులు ఉంటాయని, సూయిజ్ కెనాల్ పరిధిలో ఈజిప్ట్ కూడా ఇలాంటి ఫీజులు వసూలు చేస్తోందని ఇరాన్ మీడియా పేర్కొంది.అయితే హోర్ముజ్ జలసంధి సహజ సముద్ర మార్గం కాగా, సూయిజ్ కెనాల్ మానవ నిర్మిత జలమార్గం కావడంతో రెండు ప్రాంతాల నిబంధనలు ఒకేలా వర్తిస్తాయా అనే చర్చ అంతర్జాతీయ స్థాయిలో మొదలైంది. మరోవైపు అమెరికా ఆంక్షల నేపథ్యంలో అమెరికన్ టెక్ కంపెనీల నుంచి ఇరాన్ వాస్తవంగా ఫీజులు ఎలా వసూలు చేస్తుందన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

ఎబోలా కలకలం.. ప్రపంచవ్యాప్తంగా అప్రమత్తం చేసిన డబ్ల్యూహెచ్‌వో

ప్రపంచ సవాళ్ల మధ్య భారత్ పురోగతి కొనసాగుతోంది: మోదీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *