ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో దళిత క్రైస్తవులే అధికం: సీఎం రేవంత్ రెడ్డి
మెదక్, డిసెంబర్ 25:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రిస్మస్ సందర్భంగా మెదక్ జిల్లాలో పర్యటించారు. ముందుగా ఏడుపాయల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం, ఆ తర్వాత మెదక్ క్యాథెడ్రల్ చర్చిని సందర్శించారు.
చర్చిలో పాస్టర్లు సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ చర్చి నమూనా జ్ఞాపిక అందజేశారు. అనంతరం సీఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. చర్చిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, మెదక్ చర్చి వందేళ్ల వేడుకలు జరుపుకోవడం గర్వకారణమని అన్నారు. క్రైస్తవ సోదరులు ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, పేదలకు న్యాయం జరిగేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో ఎక్కువగా దళితులు, గిరిజన క్రైస్తవులే ఉన్నారు అని తెలిపారు. పంట బోనస్‌తో పాటు కర్షకులకు రుణమాఫీ చేసి రూ.21 వేల కోట్లను మాఫీ చేసిన ప్రభుత్వం పేద రైతులకు భరోసా కల్పించిందని సీఎం రేవంత్ తెలిపారు.
మెదక్ జిల్లాను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొని, ఎవరైనా సమస్యలుంటే మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
చివరిగా, అందరికీ మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.