కడప రిమ్స్‌లో గాలివీడు ఎంపీడీవోను పరామర్శించిన పవన్ కల్యాణ్
కడప: గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై జరిగిన దాడి ఘటనపై జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవహర్ బాబును శుక్రవారం పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి జనసేన పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
అమానుష చర్యలపై తీవ్ర హెచ్చరిక
మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, “గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై అమానుష దాడి వైకాపా నాయకుల అధికారం, అహంకారం ఎంత పెరిగిందో చూపిస్తోంది. ఇది వైకాపా ప్రభుత్వంలో ఒక మామూలు విషయం అయిపోయింది. కానీ, కూటమి ప్రభుత్వం అంటే ఏంటో, ప్రజాస్వామ్య పరిమితులంటే ఏమిటో వారికి తెలియజేస్తాం. ఇష్టారాజ్యంగా అధికారులపై దాడులు చేస్తే గట్టిగా బుద్ధి చెబుతాం. మీ అహంకారం, అధికారం పునాది నుంచి కూల్చడమే మా లక్ష్యం” అని అన్నారు.
రైతు కుటుంబం ఆత్మహత్యపై స్పందన
పులివెందులలో ఓ రైతు కుటుంబం ఆత్మహత్య ఘటనపై కూడా పవన్ స్పందిస్తూ, “ఆ ఘటన చాలా బాధాకరం. దీనిపై సమగ్ర విచారణ జరుపుతామని, నివేదిక వచ్చేంతవరకు వేచి ఉంటామని” తెలిపారు. రెండు రోజుల క్రితం రైతు తన భూమి మ్యుటేషన్ పత్రాలు సిద్ధం చేసుకున్నట్లు పేర్కొంటూ, “ఎలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్య జరిగింది అన్నది పరిశీలించి బాధ్యత వహించే చర్యలు తీసుకుంటాం” అని పవన్ తెలిపారు.
సహనానికి పునాదులు వేస్తాం
పవన్ కల్యాణ్ దాడి ఘటనలపై స్పందిస్తూ, “ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలను సహించేది లేదు. ప్రజాస్వామ్య పరిరక్షణకై, బాధితులకు న్యాయం చేయడమే మా కర్తవ్యం” అని జనసేన పార్టీ స్పష్టం చేసింది.
