Breaking News

Medical tests for Chandrababu

చంద్రబాబుకు వైద్య పరీక్షలు

రాజమండ్రి, అక్టోబరు 13: రాజమండ్రి సెంట్రల్‌ జైలుకి వైద్య బృందం చేరుకుంది. డీహైడ్రేషన్‌, స్కిన్ అలర్జీతో బాధపడుతున్న చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశారు. జైలు సూపరింటెండెంట్‌ అనుమతితో ఈ పరీక్షలు నిర్వహించారు. డెర్మటాలజీ డాక్టర్ల సలహాతో చంద్రబాబు మెనూలో కొన్ని మార్పులు చేశారు. చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారన్న డాక్టర్లు తెలిపారు. 34 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైలులోనే ఉంటున్నారు. ఇదిలావుంటే సాయంత్రం చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్‌ కానున్నారు.స్కిల్ స్కామ్ కేసులో అరెస్టయి 34 రోజులుగా జైల్లో ఉంటున్న చంద్రబాబు.. వాతావరణ మార్పులవల్ల ఇటీవల డీహైడ్రేషన్‌కు గురి కాగా.. ఆయనకు చికిత్స అందించారు. తాజాగా బాబుకు స్కిన్ అలర్జీ కూడా రావడంతో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. సెంట్రల్ జైలుకు వెళ్లిన డెర్మటాలజిస్టులు డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ సునీత దేవి వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా.. చంద్రబాబు ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి జైల్లోనే ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. తీవ్రమైన ఎండ వేడిమి, ఉక్కపోత కారణంగా టీడీపీ అధినేత చంద్రబాబుకి స్కిన్ అలర్జీ వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని జైలు అధికారులు హెల్త్‌ బులెటిన్‌ రిలీజ్‌ చేశారు. బాబు ఆరోగ్యంపై ఎలాంటి భయాందోళనలు, అపోహలు అవసరంలేదని వెల్లడించారు.రాజమండ్రి పరిసరాల్లో కొన్ని రోజులుగా వాతావరణం అంతగా బాగోలేదు. పైగా 2వేల మందికి పైగా ఖైదీలు ఉన్న జైలులో ఉండటంతో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించి ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఏసీకి అలవాటు పడిన చంద్రబాబు.. జైలు వాతావరణంలో ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది.73 ఏళ్ల చంద్రబాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు.. ఆయనతో ములాఖత్ అయిన ప్రతిసారీ కుటుంబసభ్యులు ఆరోపించారు. అటు టీడీపీ నేతలు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తుతూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు హుటాహుటిన వైద్యులు వచ్చి వైద్యపరీక్షలు నిర్వహించడంతో.. చంద్రబాబుకు ఏమైందనే ఆందోళన మొదలైంది.\

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *