భారత గ్రాండ్ మాస్టర్ గుకేశ్‌కి ఎలాన్ మస్క్ అభినందనలు
భారత యువ చెస్ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ తన అద్భుత ప్రతిభతో ప్రపంచాన్ని మెప్పించి చరిత్ర సృష్టించాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో చైనా చెస్ మేటి డింగ్ లిరెన్‌పై సంచలన విజయం సాధించి, ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. 18 ఏళ్ల 8 నెలల 14 రోజుల్లోనే ఈ అత్యున్నత టైటిల్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా గుకేశ్ రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు.
ఈ ఘన విజయంపై భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా, ప్రముఖ టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత మరియు అపార సంపన్నుడు ఎలాన్ మస్క్, గుకేశ్‌కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేస్తూ గుకేశ్ విజయాన్ని ప్రశంసిస్తూ, “కంగ్రాట్స్” అని పేర్కొన్నారు.
గుకేశ్ విజయంపై ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతని భవిష్యత్తుపై మస్క్ ఆశాభావం వ్యక్తం చేయగా, అభిమానులు కూడా గుకేశ్‌కి శుభాకాంక్షలు చెబుతూ మరిన్ని ఘన విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.
గుకేశ్ విజయంతో భారత చెస్ రంగానికి కొత్త గర్వకారణం ఏర్పడింది. 18 ఏళ్ల కుర్రాడు అంతర్జాతీయ వేదికపై చూపించిన ఈ అద్భుత ప్రదర్శన దేశ ప్రజలందరినీ గర్వపడేలా చేసింది.