తెలంగాణ నుంచి హెచ్1 బీ వీసాలకు ఎక్కువగా అభ్యర్థులు: నరేష్ ఎం గెహీ
హైదరాబాద్: యూఎస్ అటార్నీ, గెహీ ఇమ్మిగ్రేషన్ అండ్ ఇంటర్నేషనల్ లీగల్ సర్వీసెస్ ప్రిన్సిపల్ ఫౌండర్ నరేష్ ఎం గెహీ శుక్రవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ, తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో హెచ్1 బీ వీసాలకు అభ్యర్థులు వచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన బంజారాహిల్స్లో ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, తమ సంస్థ హైదరాబాద్ శాఖను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్, సోషలైట్ సుధా జైన్, వర్ధమాన నటులు అభిలాష్ సుంకర, లక్ష్య నాయుడు తదితరులు హాజరయ్యారు.
నరేష్ ఎం గెహీ మాట్లాడుతూ, “యూఎస్ నిబంధనలు అనుసరించి, అక్కడ ఉండే వారికి ఇబ్బందులు ఉండవని, విద్యార్థులు అంగీకరించిన యూనివర్సిటీల్లో చేరితే సమస్యలు రావని” అన్నారు. ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు విద్యార్థులకు ఎదురైన కష్టాల గురించి అపోహలు మాత్రమేనని, హెచ్1 బీ వీసా తిరస్కరణ పొందినట్లయితే దానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఓ1 వీసా ద్వారా కూడా యూఎస్‌లో ఉండవచ్చని చెప్పారు.
ఓ1 వీసా గురించి వివరించడంతో, “సైన్స్, కళలు, విద్య, వ్యాపారం, అథ్లెటిక్స్ లేదా మోషన్ పిక్చర్, టెలివిజన్ పరిశ్రమల్లో ప్రతిభను ప్రదర్శించినవారు ఈ వీసా కోసం అర్హులు. ఈ వీసాకు ఎలాంటి పరిమితులు ఉండవు” అన్నారు. ఇంకా, ఇన్వెస్టర్ వీసా (ఈబీ-5) 8 లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టినవారికి సులభంగా పొందవచ్చని తెలిపారు.
తమకు న్యూయార్క్‌లో మూడు కార్యాలయాలు ఉన్నాయని, తెలంగాణ నుంచి ఎక్కువగా హెచ్1 బీ వీసాలకు సంబంధించిన కేసులు వస్తున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, “యూఎస్‌లో తెలుగు వారికి ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలకు తగిన పరిష్కారాలను చూపించేందుకు గెహీ వారి కార్యాలయం నగరంలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది” అని తెలిపారు.