డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో దిల్ రాజు భేటీ: ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆహ్వానం
మంగళగిరి, డిసెంబర్ 29: జనసేన ఆఫీసులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి చర్చించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న ఈ సినిమాకి విజయవాడలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రావాల్సిందిగా దిల్ రాజు పవన్‌ను ఆహ్వానించారు.
సినీ పరిశ్రమ అంశాలపై చర్చ
ఈ సందర్భంగా దిల్ రాజు, పవన్ కల్యాణ్‌తో టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోల అనుమతుల వంటి కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇటీవల పుష్ప-2 (Pushpa-2) సినిమా రిలీజ్ సందర్భంగా సంథ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై కూడా దిల్ రాజు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. థియేటర్ల వద్ద భద్రతా ఏర్పాట్లు, టికెట్ రేట్ల అంశాలను సరిచూడాల్సిన అవసరం ఉందని దిల్ రాజు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
వివరాలు త్వరలో వెల్లడి
ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతుండగా, భేటీ ముగిసిన తర్వాత దిల్ రాజు మీడియాకు పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు జనసేన వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశం సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక అంశాలకు పరిష్కారం చూపుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.