టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తిరుమలలో ఆకస్మిక తనిఖీలు
తిరుమల: టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు శనివారం తిరుమలలోని పరకామణి భవనం, లడ్డూ బూందీ పోటు, లడ్డూ విక్రయ కేంద్రం వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
పరకామణి భవనంలో నిఘా పెంపు
ముందుగా పరకామణి భవనాన్ని సందర్శించిన ఆయన, హుండీ లెక్కింపు ప్రక్రియను పరిశీలించి నాణేలు, నోట్లు, బంగారం, వెండి, ఇతర కానుకల విభజన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. లెక్కింపులో పాల్గొనే సిబ్బంది తనిఖీ విధానాల గురించి ఆరా తీస్తూ, భద్రతా చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సీసీ టీవీ నిఘాను మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
లడ్డూ బూందీ పోటులో పరిశీలన
అనంతరం బూందీ పోటును పరిశీలించిన చైర్మన్, బూందీ తయారీ విధానం, నెయ్యి టిన్‌ల వినియోగం, పిండి మిక్సింగ్, కన్వేయర్ బెల్ట్ ద్వారా ముడి పదార్థాల రవాణా విధానాన్ని నిశితంగా గమనించారు. పోటు సిబ్బందికి పరిశుభ్రత, భక్తిభావంతో విధి నిర్వహణ చేయాలని సూచిస్తూ, ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
లడ్డూ విక్రయ కేంద్రం తనిఖీ
తదుపరి లడ్డూ విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసిన బీ.ఆర్.నాయుడు, భక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడి లడ్డూ బరువును ప్రత్యేకంగా పరిశీలించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
శ్రీవారి ఆలయంలో లడ్డూ తయారీ పరిశీలన
అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకున్న చైర్మన్, లడ్డూ తయారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. రోజుకు ఎన్ని లడ్డూలు తయారవుతాయి? ఏయే అన్నప్రసాదాలు సిద్ధం చేయబడతాయి? అనే అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తయారీ విధానంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇదే విధంగా కొనసాగించాలని సూచించారు.
గతంలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న వివాదం నేపథ్యంలో టీటీడీ తరచుగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తోంది. అదే సమయంలో వైసీపీ హయాంలో లడ్డూ కల్తీపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, భక్తుల నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ నిరంతరం నిఘా పెంచుతోంది.