ప్రతిపక్ష హోదా కోరుతూ అసెంబ్లీలో వైసీపీ హంగామా – గవర్నర్ ప్రసంగం బహిష్కరణ
అమరావతి: ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సభ్యులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నినాదాలు చేశారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా, గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి అడ్డుగా నినాదాలు చేస్తూ వైసీపీ సభ్యులు సభను బహిష్కరించారు.
గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే వైసీపీ ఆందోళన
గవర్నర్ ప్రసంగాన్ని ప్రారంభించగానే, వైసీపీ సభ్యులు “సేవ్ డెమోక్రసీ”, “వాంట్ జస్టిస్” అంటూ నినాదాలు చేశారు. అనంతరం పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలియజేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సభ్యుల సహా అసెంబ్లికి హాజరయ్యారు.
ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ డిమాండ్
ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు మొదటి నుంచీ డిమాండ్ చేస్తున్నారు. స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ రాశారు. సమాధానం రాకపోవడంతో హైకోర్టును కూడా ఆశ్రయించారు, అయితే ఆ పిటిషన్ ఇంకా పెండింగ్‌లో ఉంది. గత అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోయిన జగన్, ఈసారి హాజరయ్యారు.
అసెంబ్లీ బహిష్కరణ
గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగించకుండా నినాదాలు చేసిన వైసీపీ సభ్యులు, కొద్దిసేపటికే అసెంబ్లీని బాయ్కాట్ చేశారు. ప్రతిపక్ష హోదా లేకపోతే ప్రజా సమస్యలపై ఎలా ప్రశ్నిస్తామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో, వైసీపీ తీరుపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.