తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిన కేసీఆర్, రేవంత్: ఎంపీ లక్ష్మణ్
నల్గొండ: రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పాలనపై బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. నల్గొండ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని వదిలి వెళ్లగా, అనుభవం లేని రేవంత్ రెడ్డి మరింత అప్పుల ఊబిలోకి నెడుతున్నారని ఆరోపించారు.
ఉద్యోగుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం ఎంత దారుణ పరిస్థితిలో ఉందో ఇదే నిదర్శనం అని విమర్శించారు. ఉద్యోగులు తమ హక్కులను కోర్టులో సాధించుకునే పరిస్థితి రావడం బాధాకరమన్నారు.
ఆరోగ్య పథకాన్ని పట్టించుకోవడం లేదని విమర్శ
ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వైద్య సేవలు కూడా అందడం లేదని, ఆసుపత్రులు బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్య పథకాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఐదేళ్లకు ఓసారి పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.
డీఏ బకాయిలు, ఆర్థిక సమస్యలపై అసంతృప్తి
ఇప్పటికే ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండగా, వీటిపై ప్రభుత్వం చర్చించకపోవడం దారుణమన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ దిగజారిపోతున్నప్పటికీ, దీనిపై అధికారంలో ఉన్న వారెవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
రాష్ట్ర పరిస్థితులను బీజేపీ ఎండగడుతుంది
తెలంగాణలో బీజేపీ బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని, ప్రజల సమస్యలను ఎత్తిచూపి, ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసేందుకు బీజేపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు.