బీఆర్ఎస్ నేతల చేరికపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు
నిజామాబాద్: బీఆర్ఎస్ (BRS) నేతలు బీజేపీలో (BJP) చేరతారన్న ప్రచారంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) కీలక వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం తప్ప ఎవరైనా బీజేపీలోకి రావచ్చని స్పష్టం చేశారు.
“హరీష్ రావు ముందుగా తేల్చుకోవాలి”
ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు స్పందించిన అరవింద్, బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరే వారిని ఆహ్వానిస్తామని ప్రకటించారు. అయితే హరీష్ రావు (Harish Rao) విషయంలో ముందుగా ఆయన స్వయంగా తేల్చుకోవాలని అన్నారు. “హరీష్ కల్వకుంట్ల కుటుంబానికి చెందినవాడా, కాదా?” అని ప్రశ్నించారు.
“ఒక కాలు అటు.. మరో కాలు ఇటు పెడతామంటే కుదరదు”
హరీష్ రావు భవిష్యత్తు రాజకీయాలపై చురకలు వేస్తూ – “ఒక కాలు అటు, మరో కాలు ఇటు పెడతానంటే కుదరదు” అని వ్యాఖ్యానించారు. హరీష్ రావు కేసీఆర్ (KCR) అవినీతికి, దుర్మార్గ పాలనకు భాగమా కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ హిందుత్వ కార్యకర్తలపై పెట్టిన దొంగ కేసుల్లో ఆయన పాత్ర ఉందా? అనే అంశాన్ని స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు.
“కేసీఆర్‌ను విమర్శించిన తర్వాతే ఆలోచించగలం”
హరీష్ రావు నిజంగా బీజేపీలో చేరదలచుకుంటే, ముందుగా కేసీఆర్‌ను విమర్శించాలి అని అరవింద్ సూచించారు. “ముందుగా కేసీఆర్‌పై విమర్శలు చేసిన తర్వాత వచ్చి రిక్వెస్ట్ చేస్తే, అప్పుడు ఆలోచిస్తాం” అని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ కీలక నేతలపై ఊహాగానాలు
ఇటీవల బీఆర్ఎస్‌లోని కీలక నేతలు కొందరు బీజేపీ వైపు చూస్తున్నారని, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) సమయానికి ముందే వారు బీజేపీలో చేరతారని ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు మరింత రాజకీయ వేడి పెంచుతున్నాయి.