“ఆర్. కృష్ణయ్యను బహిష్కరించాలి” – కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీజేపీ రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య (R. Krishnaiah)పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (K.A. Paul) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం విడుదల చేసిన వీడియోలో, కృష్ణయ్య మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, బీసీ నాయకులందరూ ఆయనను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
“ఎవరైతే అధికారం ఇస్తారో వారికే మద్దతుగా వెళ్తున్నారు”
కేఏ పాల్ మాట్లాడుతూ, “ముందు కాంగ్రెస్, ఆ తర్వాత టీడీపీ, వైసీపీ, ఇప్పుడు బీజేపీ… ఎవరు రాజ్యసభ సీటు ఇచ్చి డబ్బు ఇస్తే, ఆ పార్టీకి మద్దతుగా తిరుగుతున్నారు” అంటూ ఆర్. కృష్ణయ్యపై విమర్శలు గుప్పించారు. “80 ఏళ్ల ముసలోడికి ఇవన్నీ అవసరమా?” అని వ్యాఖ్యానించారు.
“బీసీలకు రాజ్యాధికారం తేవాలని గతంలో కృష్ణయ్య చెప్పారు”
కృష్ణయ్య గతంలో “60 శాతం బీసీలకు అధికారంలో భాగస్వామ్యం లేదు, మేము బిచ్చగాళ్లమా?” అంటూ తనతో కలిసి ఉద్యమం నిర్వహించారని, కానీ ఇప్పుడు తానే బిచ్చగాడిగా మారిపోయారని కేఏ పాల్ విమర్శించారు.
“బీసీ నాయకులారా.. బయటకు రండి, రాజ్యాధికారాన్ని సాధించండి”
బీసీ సామాజిక వర్గం 60 శాతం ఉన్నా, పాలన కేవలం 3 శాతం ప్రజల చేతిలో ఉందని కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. “మనమే ఆధిక్యంలో ఉన్నప్పుడు బీసీలకు హక్కులు సాధించలేకపోతున్నాం. అందరూ ముందుకు వచ్చి రాజకీయ రాజ్యాధికారాన్ని సాధించాలి” అని పిలుపునిచ్చారు.
కేఏ పాల్ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ, ఏపీ బీసీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. దీనిపై ఆర్. కృష్ణయ్య నుంచి ఏవైనా స్పందన వస్తుందేమో చూడాలి.