భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం: 7 రోజులు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కరణల రూపకర్త డాక్టర్ మన్మోహన్ సింగ్ (92) వయసుతో సంబంధం కలిగిన అనారోగ్య కారణాల వల్ల గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 92 ఏళ్ల వయస్సులో ఆయన అనారోగ్యంతో ఇంట్లో స్పృహ కోల్పోయి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజనాథ్ సింగ్ సహా అనేక ప్రముఖులు నివాళులు అర్పించారు. ప్రధాని మోదీ తన సంతాప సందేశంలో, మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక సంస్కరణల సారథిగా, దేశ ఆర్థికవ్యవస్థను కొత్త దిశా చూపిన మహానేతగా ప్రశంసించారు.
ఆర్థిక రంగంలో అతని కృషి
మన్మోహన్ సింగ్ 2004 నుండి 2014 వరకు దేశ ప్రధానిగా పనిచేశారు. పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించి, దేశ ఆర్థిక విధానాలను ఆధునికీకరించి, ఆర్థిక సంస్కరణలను ప్రారంభించారు. ఆయనే దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచస్థాయిలో ప్రముఖంగా నిలిపిన ఆర్థికవేత్త.
అంత్యక్రియలు
కేంద్ర ప్రభుత్వం, డాక్టర్ మన్మోహన్ సింగ్ యొక్క అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. శనివారం (డిసెంబరు 28) ఆయన భౌతికకాయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకురావాలని నిర్ణయించారు. అనంతరం రాజఘాట్ సమీపంలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
7 రోజులు సంతాప దినాలు
మన్మోహన్ సింగ్ మరణాన్ని దేశం మొత్తం విషాదంగా భావిస్తోంది. ఆయన మృతికి సంతాప సూచికంగా కేంద్ర ప్రభుత్వం 7 రోజుల సంతాప దినాలు ప్రకటించింది.
ఈ మేరకు, ప్రజల సందర్శనార్థం శనివారం ఆయన పార్థివదేహాన్ని ఏఐసీసీ కార్యాలయానికి తీసుకెళ్లి, అక్కడ సంస్కార కార్యక్రమాలు ప్రారంభించనున్నారు.