భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ. 12 వేలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్:
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక పథకం ప్రారంభిస్తోందని తెలిపారు. ఈ పథకంలో భాగంగా ప్రతి ఏడాది రూ. 12 వేలు అందజేస్తామని, ఈ మొత్తాన్ని రెండు విడతల్లో అకౌంట్‌లో జమ చేస్తామని చెప్పారు.
తొలి విడత డిసెంబర్ 28న:
మొదటి విడతగా వచ్చే ఏడాది డిసెంబర్ 28న రూ. 6 వేలు అందజేస్తామని, మిగతా మొత్తం రెండో విడతలో చెల్లిస్తామని భట్టి విక్రమార్క వివరించారు. ఈ పథకం నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగిస్తుందన్నారు.
బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు:
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని భట్టి మండిపడ్డారు. అప్పుల విషయంలో బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శిస్తూ, కాంగ్రెస్ దగ్గర పూర్తి లెక్కలు ఉన్నాయన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం భారీగా అప్పుల్లో కూరుకుపోయిందని, ఆ అప్పులపై వడ్డీలు కట్టడమే తమకు కష్టమైందన్నారు.
కాంగ్రెస్ పథకాలతో ప్రజల మేలు:
తమ పాలనలో రూ. 66,722 కోట్ల అప్పులు చెల్లించినట్లు తెలిపారు. అదేవిధంగా రూ. 21 వేల కోట్ల రుణమాఫీని ఒకే ఏడాదిలో పూర్తి చేశామని చెప్పారు. సన్నాలకు రూ. 500 బోనస్ ఇవ్వడం ద్వారా రైతులకు మేలు చేస్తున్నామని తెలిపారు. తాము ఆహార నాణ్యత విషయంలో ఎప్పుడూ రాజీపడబోమని స్పష్టం చేశారు.
గాలి మాటలతో కాదు, గట్టిపనులతో ముందుకు:
భట్టి విక్రమార్క మాట్లాడుతూ, బీఆర్ఎస్ మాటలు ప్రజలను మభ్యపెడుతున్నాయని, తాము మాత్రం గాలి మాటలు చెప్పబోమని, అబద్ధాలతో నడవబోమని తెలిపారు. కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే విధంగా తమ విధానాలను అమలు చేస్తుందని అన్నారు.